సంక్రమణం

సంక్రమణమంటే గమనం. సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి అడుగు పెట్టడాన్ని సంక్రమణం అంటారు. సంవత్సర కాలంలోసూర్యుడు పన్నెండు రాశులలో ప్రవేశిస్తుంటాడు. ఈ అనంత విశ్వంలో జరిగే ప్రధాన సంఘటనల ఆధారంగానే సూర్య చంద్ర గమనాలు, నక్షత్రరాశుల కదలికలు. భూగోళం మీది సమస్త సంస్కృతీ సంప్రదాయాలకు, వైవిధ్యానికి ఆయువు పట్లు. అటువంటి వాటిలో ‘ఉత్తరాయణం’ ముఖ్యమైనది. సూర్యుడు నెలకు ఒక నక్షత్రరాశిలో సంచరిస్తూ ఉంటాడు. దానిని బట్టి ఆ నెలను ఆ రాశి పేరుతో పిలుస్తారు. అదే సంక్రమణం. సూర్యుడు ధనూరాశి నుంచి మకరరాశిలోకి ప్రవేశించటమే మకర సంక్రమణం. అదే మహాపర్వదినం. పన్నెండు రాశుల సంక్రాంతుల్లోనూ ఆషాఢ మాసంలో వచ్చే కర్కాటక సంక్రమణం, పుష్య మాసంలో వచ్చే మకర సంక్రమణం ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. మొదటి సంక్రమణం దక్షిణాయనాన్ని, మకర సంక్రమణం ఉత్తరాయనాన్ని ప్రారంభిస్తాయి. ఉత్తరాయణాన్ని పుణ్యప్రదంగా భావిస్తారు.

మకరరాశిలోకి ప్రవేశించిన సూర్య భగవానుని ఆహ్వానిస్తున్న రంగవల్లులు (ముగ్గులు)

ప్రాధ్యాన్యత

సూరీడు ప్రతినెలలోనూ ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారుతుంటాడు. అయితే ఆయన ధనూరాశి నుండి మకరరాశిలోనికి ప్రవేశించించడమే ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణింపబడుతోంది. అందువల్ల ఈ సంక్రాంతి పర్వదినం చాలా శ్రేష్ఠమైనది. దేవతల పగలుగా చెప్పే ఉత్తరాయణానికి అంతటి విశిష్ఠత ఉండబట్టే కురుక్షేత్ర సంగ్రామంలో పోరాడి అస్తస్రన్యాసం చేసి మృత్యుదేవత ఒడికి చేరువలో ఉన్న భీష్మపితామహుడు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేవరకు ప్రాణాలను నిలుపుకుని అంపశయ్యపై పరుండి ఆ పిమ్మటే ప్రాణత్యాగం చేశాడు. అందుకే ఉత్తరాయణంలో వచ్చే మకర సంక్రమణానికి అంతటి ప్రాముఖ్యత.

ఇవి కూడా చూడండి

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.