హాసం

హాసం (Haasam) తెలుగులో ప్రచురించబడిన హాస్య సంగీత పత్రిక. ఈ పత్రిక అక్టోబరు 2001 నుండి పక్ష పత్రికగా ముద్రించబడింది. ఈ పత్రికకు శాంతా బయోటెక్ కంపెనీ వ్యవస్థాపకుడు కె.ఇ.వరప్రసాద్ రెడ్డి అధిపతి, రాజా సంపాదకులు. ఇది హైదరాబాదులోని హుమ్మస్ ఇన్ఫోవే లిమిటెడ్ ద్వారా విడుదలయ్యేది. భారతీయ సంగీతానికి మరియు హాస్యానికి అంకితమైన ఏకైక తెలుగు పత్రిక. ప్రతి పత్రికలో పలు కథలు, సీరియల్స్, సంగీతానికి సంబంధించిన శీర్షికలు చాలా ఆసక్తికరంగా ఉండేవి. ఈ పత్రిక ద్వారా ఎందరో ప్రముఖ సంగీతకారుల్ని, పాత తెలుగు సినిమాలను, సినీ ప్రముఖుల్ని పరిచయం చేశారు. దీనిలోని బాపూరమణీయం శీర్షిక ఒక ప్రత్యేక ఆకర్షణగా ఉండేది.ఇది ఇంటర్నెట్టులో కూడా లభించేది. విడుదలైన సంచికలన్నీ కూడా సేకరించి దాచుకోవల్చినంత చక్కటి సమాచారం ఈ పత్రికలో ప్రచురించబడేది. కాని, సరైన ఆదరణ లభించక, ఈ పత్రిక 2004వ సంవత్సరంలో మూతబడింది.

వీణ బదులుగా, గిటార్ వాయిస్తున్నట్టు చిత్రించబడ్డ సరస్వతీదేవి, హాసం పత్రిక చిహ్నం (LOGO)
హాసంపత్రిక 2003 సంవత్సరపు సంచికలలో ఒకటి

శీర్షికలు

హస్య, సంగీతాల్లో అభిరుచి, పరిజ్ఞానం, ఆస్వాదన పెరిగేలా పలు శీర్షికలు నిర్వహించారు. పాఠకుల నుంచి ఆయా శీర్షికలకు విశేష స్పందన లభించడమే కాక పత్రిక నిర్వహణ నిలిపివేశాకా విలువైన ఆయా శీర్షికలను పుస్తకాలుగా ప్రచురించారు. ఈ క్రింది శీర్షికలు పత్రిక నడుస్తూండగా ఆదరణ పొంది, అనంతరం హాసం ప్రచురణల ద్వారా పుస్తక రూపాన్ని పొందాయి.

శీర్షికరచయిత
ఎందరో మహానుభావులుతనికెళ్ల భరణి
అచలపతి కథలుఎమ్బీఎస్ ప్రసాద్
జంధ్యామారుతం
హ్యూమరథంరావి కొండలరావు
కిశోర్ జీవనఝరి
కోమలి గాంధారంమృణాళిని
నవ్వుటద్దాలుఆచార్య తిరుమల
పద్మనాభం ఆత్మకథపద్మనాభం

అభిప్రాయాలు

  • ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం-"తెలుసుకోవాలంటే వెలియజేయాలంటే బోలెడు విషయాలున్నాయ్. కాగితం నింపాలంటే కూడా బోలెడు విషయాలుంటాయ్. చెప్పిందే చెప్పొచ్చు. రాసిందే రాయొచ్చు. అట్టమీద బొమ్మ, మహా అయితే ఇష్టమైన ఏదో ఓ శీర్షిక 'చూసి' 2 నిమిషాల్లో ఆవతల పడెయ్యొచ్చు. విషయసూచికలో ఉన్న అన్ని శీర్షికలూ విషయమున్నవే ఉండాలంటే, నిర్వహించేవారికి సంస్కారం ,సహనం ఉండాలి. చదివే వాళ్ళ మీద నమ్మకముండాలి. అప్పుడే హస్తభూషణం గా మాత్రమేగాక, మస్తకానికి పనిపెడుతుంది పుస్తకం! 'చదవడం' కరువైపోతున్న రోజుల్లో పరువైన పుస్తకాలు, సరుకున్న పుస్తకాలు గగనమైపొతున్న రోజుల్లో 'హాసం' 'సంస్కారులైన' పాఠకులకు ఓ అపురూప వరం-తెలిసిన వాళ్ళక్కూడా, "అరే ఈ విషయం నాకు తెలీదే" అనిపిస్తోంది. బూతు బొమ్మ, రోత సాహిత్యం ఉంటేనే సర్క్యులేషన్ పెరుగుతుందని తమని తాము మోసం చేసుకుంటున్న సంపాదకులకి ఓ పాఠం 'హాసం'...."
  • రావి కోండలరావు-'హాసం' ని అందరూ మెచ్చుకుంటున్నారు. ఆనందంగా ఉంది.

బయటి లింకులు

This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.