బొబ్బిలి

బొబ్బిలి (ఆంగ్లం: Bobbili)', ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విజయనగరం జిల్లాలోని ఒక పట్టణం, అదే పేరుతో గల ఒక మండలానికి కేంద్రం.[1] (వినండి: i//)

ఉత్కృష్టమైన చరిత్ర కలిగిన పట్టణమిది. పరాసు ప్రభువుల (ఫ్రెంచి) పాలనలో ఒక సంస్థానంగా ఉన్న బొబ్బిలికి పొరుగు రాజ్యం విజయనగరంతో శతృత్వం ఉండేది. ఈ శతృత్వం ముదిరి బొబ్బిలికీ, పరాసు, విజయనగర సంయుక్త సైన్యానికి మధ్య యుద్ధానికి దారితీసింది. ఆ యుద్ద్ధంలో జరిగిన మారణకాండ, బొబ్బిలి వెలమ వీరుల, తెలగ వీరుల, బొందిలి వీరుల వీరమరణాలు, బొబ్బిలి స్త్రీల ఆత్మాహుతి మొదలైనవి బొబ్బిలి కథకు ఒక వీరోచిత జానపద గాథ స్థాయి కల్పించాయి. బొబ్బిలి ఆంధ్ర ప్రదేశ్ శాసనసభలోని ఒక నియోజకవర్గం.

బ్రిటిషు వారి కాలంలో బొబ్బిలి గణాంకాలు

బ్రిటిషు వారి ఇంపీరియల్ గెజెట్ ప్రకారం బొబ్బిలి వివరాలిలా ఉన్నాయి. బొబ్బిలి అప్పటి విజాగపటం జిల్లాలో ఉండేది. 1901లో దీని జానాభా 17,387. బొబ్బిలి రాజా వారి సంస్థానం 227 చ.మై. విస్తీర్ణంలో ఉండేది. ఆదాయం - రూ 40,000. అందులో భూమి శిస్తు: రూ 9,000.

చరిత్ర

జనవరి 24, 1757లో బుస్సీ బొబ్బిలిపై చేసిన దాడి భారత చరిత్రలో ఒక మరపురాని ఘట్టం. బొబ్బిలికి, పొరుగున ఉన్న విజయనగరానికి మధ్య నిరంతర శతృత్వం ఉండేది. విజయనగర రాజు బుస్సీతో చేతులు కలిపి బొబ్బిలిపై దాడి చేసాడు. బొబ్బిలి వెలమ వీరులు, తెలగ వీరులు, బొందిలి వీరులు వీరమరణాలు చెందగా, స్త్రీలు ఆత్మ త్యాగం చేసారు. యుద్ధం ముగిసాక, వీజయరామరాజు తన గుడారంలో నిదుర పోతుండగా, బొబ్బిలి రాజు బావమరిది యైన తాండ్ర పాపారాయుడు అతడిని హతమార్చాడు.

బొబ్బిలి రాజు రంగారాయుని కుమారుడు, పసి బాలుడు చిన్న రంగారావు బుస్సీకి చిక్కాడు. ఆ బాలుడినే బొబ్బిలి రాజుగా బుస్సీ పట్టాభిషేకం చేసాడు. అయితే అతని పసితనాన్ని అవకాశంగా తీసుకుని బంధువులు రాజ్య పీఠాన్ని ఆక్రమించుకున్నారు. విజయనగరం రాజుతో సంధి కుదిరినా అది తాత్కాలికమే అయింది. ఇద్దరి మధ్యా మళ్ళీ ఘర్షణలు మొదలై బొబ్బిలి రాజు పారిపోయి నిజాము రాజ్యంలో తలదాచుకున్నాడు. 1794లో బ్రిటిషు వారు చిన్న రంగారావును మళ్ళీ పీఠంపై కూర్చోబెట్టారు.

1801 లో ఆయన కుమారుడితో బ్రిటిషువారు శాశ్వత సంధి ఒడంబడిక కుదుర్చుకున్నారు. రాజా అనే బిరుదును వంశపారంపర్య చిహ్నంగా గుర్తించారు. మహారాజ బిరుదును చిన్న రంగారావు ముని మనుమడైన సర్ వేంకటాచలపతి రంగారావుకు వ్యక్తిగత హోదాగా సమర్పించారు.

బొబ్బిలి రాజుల వంశక్రమం

  1. రాజా నిర్వాణ రాయడప్ప - 1652
  2. రాజా లింగప్ప
  3. రాజా వేంగళరాయ రంగారావు
  4. రాజా రంగపతి రంగారావు
  5. రాజా రాయడప్ప రంగారావు
  6. రాజా గోపాలకృష్ణ రంగారావు
  7. రాజా గోపాల వెంకటరంగారావు
  8. రాజా వెంకట రంగారావు
  9. రాజా సీతా చలపతి రంగారావు
  10. రాజా సీతా రామకృష్ణ రాయడప్ప రంగారావు
  11. రాజా వేంకట శ్వేతాచలపతి రంగారావు
  12. రాజా కుమారకృష్ణ రంగారావు
  13. రాజా శ్వేతా చలపతి రామకృష్ణ రంగారావు
  14. రాజా వేంకట గోపాల కృష్ణ రంగారావు
  15. రాజా వెంకట సుజయ కృష్ణ రంగారావు ప్రస్తుతం యం.ఏల్.ఏ. బొబ్బిలి నియోజకవర్గం
  16. రాజా రామ కృష్ణ రంగారావు
  17. రాజా వెంకట శ్వేతాచలపతి కుమార కృష్ణ రంగారావు మాజీ మున్సిపల్ ఛైర్ పర్స్ న్ బొబ్బిలి మువ్సిపాలిటి
  18. రాజా విశాల్ గోపాల కృష్ణ రంగారావు.

లోక్‌సభ నియోజక వర్గం

  • పూర్తి వ్యాసం కోసం బొబ్బిలి లోక్‌సభ నియోజకవర్గం చూడండి.
  • భారత పార్లమెంట్ లో బొబ్బిలి ఒక లోక్‌సభ నియోజకవర్గం. ప్రస్తుత పార్లమెంటు సభ్యురాలు బొత్స ఝాన్సీ లక్ష్మి.

బొబ్బిలి శాసనసభా నియోజకవర్గం

బొబ్బిలి ఆంధ్ర ప్రదేశ్ శాసనసభలో 1951 సంవత్సరం నుండి ఒక నియోజకవర్గంగా ఏర్పడి శాసనసభ్యుల్ని ఎన్నుకొంటుంది. 2007-08 పునర్వ్యవస్థీకరణ తరువాత బొబ్బిలి, రామభద్రపురం, బాడంగి మరియు తెర్లాం మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలో చేర్చారు.

విద్యాసంస్థలు

  1. సంస్థానం ఉన్నత పాఠశాల (1864).
  2. రాజా శ్వేతా చలపతి రామకృష్ణ రంగారావు కళాశాల : బొబ్బిలి మరియు బొబ్బిలి పరిసర ప్రాంత విద్యార్థినీ విద్యార్థుల యొక్క విద్యావరసరాలను దృష్టిలో ఉంచుకొని స్దానిక రాజా శ్వేతా చలపతి రామకృష్ణ రంగారావు గారి షష్టిపూర్తి మహోత్సవం సందర్భంగా క్రీ.శ. 1962 సంవత్సరంలో ఈ కళాశాలను స్దాపించడం జరిగింది.
  3. రాజా శ్వేతా చలపతి రామకృష్ణ రంగారావు కళాశాల, ఎమ్.సి.ఏ. సెంటర్ (1999)
  4. గోకుల్ ఇంజనీరింగ్ కళాశాల
  5. తాండ్రపాపారాయ ఇంజనీరింగ్ కళాశాల
  6. అభ్యుదయ కాన్వెంట్
  7. శ్వేత చలపతి ఇంగ్లీష్ మీడియం స్కూల్

గణాంకాలు

జనాభా (2011) - మొత్తం 1,22,964 - పురుషులు 61,092 - స్త్రీలు 61,872

ఇవి కూడా చూడండి

బయటి లింకులు

గ్యాలరీ

మూలాలు

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
This article is issued from Wikipedia. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.